నందమూరి, అక్కినేని కుటుంబాల్లోని మూడు తరాల హీరోల సినిమాలకు పనిచేసిన రచయిత ఆయన. సినీ రచయితగా ఆయన కలానిది దాదాపు ఐదు దశాబ్దాల వయసు. ఇప్పటికీ అలసట అన్నది ఎరుగకుండా నిర్విరామంగా ఆయన కలం.. పదునైన, బిగువైన స్క్రీన్‌ప్లేలను అల్లుకుంటూ పోతోంది. ఇప్పటివరకూ 400కు మించి సినిమాకు కథలు, స్క్రీన్‌ప్లేలు, సంభాషణలు అందించిన ఆ గొప్ప రచయిత.. సత్యానంద్! చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో చేసిన, చేస్తున్న సినిమాల స్క్రిప్టుల్లో ఆయన చేయి ఉంది.
హైస్కూలు రోజుల నుంచే ఆయనకు కథలు రాయడం అలవాటయ్యింది. ఆయన మొదటి కథ 13వ ఏటే ఆంధ్రప్రభలో అచ్చయింది. రాజమండ్రి నుంచి మద్రాస్ వెళ్లి 21వ ఏట సినీ రచయిత అయ్యారు. దానికంటే ముందు ఆర్థిక అవసరాల కోసం ఒక పది వరకూ డిటెక్టివ్ నవలలు రాశారు. అప్పట్లో 'డిటెక్టివ్' అనే మ్యాగజైన్ వచ్చేది. దానికి ఎడిటిర్.. జీవీజీ. అందులో ఒక డిటెక్టివ్ సీరియల్ కూడా రాశారు సత్యానంద్.
ప్రఖ్యాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఆయనకు స్వయానా మేనమామ. మొదట మేనల్లుడు సినిమాల్లోకి వస్తానంటే ఆదుర్తి ఎంకరేజ్ చెయ్యలేదు. దాంతో మద్రాస్‌లో ఇంకో ముగ్గురితో పాటు ఓ రూమ్‌లో ఉంటూ డిటెక్టివ్ నవలలు రాసుకుంటూ ఏడాదిపాటు గడిపారు సత్యానంద్. ఒక్కో నవలకు రూ. 300 ఇచ్చేవారు.
ఆ తర్వాత కృష్ణ హీరోగా తను డైరెక్ట్ చేసిన 'మాయదారి మల్లిగాడు' (1973) సినిమాతో సత్యానంద్‌ను డైలాగ్ రైటర్‌గా పరిచయం చేశారు ఆదుర్తి సుబ్బారావు. ఆ సినిమా పెద్ద హిట్టవడంతో, మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఆయనకు కలగలేదు.